వందేళ్ల తర్వాత పొంగి పొర్లుతోన్న వేదవతి నది

అల్పపీడన ప్రభావంతో రాయలసీమ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులు , చెరువులు పొంగిపొర్లుతున్న. దీంతో, అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నది వరద నీటితో పోటెత్తుతోంది. గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పొంగి పొర్లుతోంది. ఈ నదిపై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా ప్రవాహం లేకుండా పోయింది. నది ఆనవాళ్లు కూడా మారిపోయే పరిస్థితి దాపురించింది.

1982, 1996లో కొద్దిగా ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత నదిలో నీరు కనిపించలేదు. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా వేదవతి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి నేపథ్యంలో వేదవతిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా 63 వేల క్యూసెక్కుల నీటిని వదలడం ఇదే తొలిసారి. వరద ఉద్ధృతి నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల్లో వేసిన పంట కొట్టుకుపోయింది. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా వేదవతి పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

వేదావతి హగరి నది పడమటి కనుమలలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగరి అని కూడా పిలుస్తారు. సహ్యాద్రి పర్వత శ్రేణి తూర్పు భాగంనుండి వస్తున్న వేద, అవతి నదులు తూర్పు వైపు ప్రవహించి “పూర” వద్ద కలసి వేదవతి నదిగా ఏర్పడుతుంది. ఈ నది ఒడ్డున అనేక ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో హొసదుర్గ తాలూకాలోని కొల్లేడు వద్ద శ్రీఆంజనేయ దేవాలయం ముఖ్యమైనది. ఈ నదిపై వాణి విలాస సాగర ఆనకట్ట నిర్మింపబడింది. ఇది శతాబ్దం నాటిది. ఈ ఆనకట్టను “మరికనివె” అని కూడా పిలుస్తారు. ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిన మొదటి ఆనకట్ట. ఇది రెండు పర్వతాల మధ్య నిర్మించిన సహజసిద్ధ ఆనకట్టగా గుర్తింపు పొందింది.