అధికారం ఇచ్చింది మా నెత్తినెక్కి కూర్చోడానికి కాదు అంటూ వైసీపీ ఫై వర్మ ఫైర్

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. గత నాల్గు రోజులుగా సినిమా టికెట్ ధరల అంశం ఫై వర్మ స్పందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పలు టీవీ ఛానెల్స్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొని ఈ టికెట్ ధరల విషయం తన నోటికి పనిచెపుతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించారు. ‘గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సార్’ అంటూనే సవాలు విసిరాడు. ‘నేను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వవలసిందిగా మిమ్మల్ని లేదా మీ ప్రతినిధులను సవినయంగా అభ్యర్థిస్తున్నాను’ అంటూ కౌంటర్లు వేసే ప్రయత్నం చేసారు వర్మ.

”సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి? గోధుమలు బియ్యం కిరోసిన్ నూనె మొదలైన నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమతౌల్యత కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ధరను నిర్ణయించవచ్చని నేను అర్థం చేసుకున్నాను.. అయితే అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది?” అని వర్మ ప్రశ్నించారు.

”ఆహార ధాన్యాలలో కూడా బలవంతంగా ధర తగ్గించడం వల్ల రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు.. తద్వారా కొరత ఏర్పడి నాణ్యత లోపిస్తుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. పేదలకు సినిమా చాలా అవసరం అని మీకు అనిపిస్తే.. వైద్య మరియు విద్యా సేవలకు ఎలా చేస్తున్నారో ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు?. పేదలకు మేలు చేయడానికి బియ్యం పంచదార మొదలైన వాటిని అందించడానికి రేషన్ షాపులు సృష్టించినట్లు.. మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా?” అని ఆర్జీవీ ట్వీట్ చేసారు.

”నిర్ధిష్ట పరిస్థితుల్లో సమతౌల్యం కంటే దిగువన లేదా అంతకంటే ఎక్కువ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత సినిమా పరిశ్రమలో మీరు ఏ ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు? ద్వంద్వ ధరల వ్యవస్థ సిద్ధాంతంలో పరిష్కారం ఉంటుంది.. ఇక్కడ నిర్మాతలు వారి ధరకు టిక్కెట్లను అమ్మవచ్చు మరియు ప్రభుత్వం కొన్ని టిక్కెట్లను కొనుగోలు చేసి పేదలకు తక్కువ ధరలకు అమ్మవచ్చు.. తద్వారా మేము మా డబ్బును పొందుతాము మరియు మీ ఓట్లు పొందొచ్చు” అని పేర్కొన్నారు. ”మీ గౌరవప్రదమైన బృందం హీరోల పారితోషికాలను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు తదితరులు రెమ్యునరేషన్ అనేది వారి సినిమా ప్రొడక్షన్ కి అయ్యే ఖర్చు – రాబడిని బట్టే నిర్ణయింపబడుతుంది” అని తెలిపారు.

”మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇవ్వడానికి అధికారం ఇచ్చారని.. మా తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు” అని వర్మ ట్వీట్స్ చేసాడు. మరి వర్మ ట్వీట్స్ కు వైసీపీ మంత్రులు , నాని ఎలా స్పందిస్తారో చూడాలి.