కృష్ణ మృతి పట్ల రామ్ గోపాల్ వర్మ ట్వీట్..బాధ పడాల్సిన అవసరం లేదు

RGV response on krishna death

సూపర్ స్టార్ కృష్ణ మృతి యావత్ సినీ పరిశ్రమ ను దిగ్బ్రాంతికి గురి చేసింది. కృష్ణ గారు ఇక లేరు అనే వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ,రాజకీయ ప్రముఖులంతా కృష్ణ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..బాధపడుతుంటే..రామ్ గోపాల్ వర్మ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

కృష్ణ గారు, విజయనిర్మల గారు స్వర్గంలో ఆడుతూ, పాడుతూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతుంటారని… అందువల్ల మనం బాధ పడాల్సిన అవసరం లేదని వర్మ అన్నారు. అంతేకాదు… ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల ‘కోరినది నెరవేరినది’ పాటను షేర్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు.

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.