RFCL ఉద్యోగ బాధితుడు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కమాన్పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో (RFCL) పర్మినెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మనస్థాపంతో ముంజ హరీష్ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కమాన్ పూర్ మండలం గుండారం వద్ద హరీశ్ డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు హరీశ్ శుక్రవారం వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. RFCL ఉద్యోగం కోసం తన నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, కొత్త కాంట్రాక్టర్ రాగానే తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని ఆవేదనం వ్యక్తం చేశాడు. దళారులను నమ్మి మోసపోయాయని వాపోయాడు.

అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ చేశాడు. తన చావుతో నైనా బాధితులకు న్యాయం జరగాలని, బాధితులకు తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరాడు. తన చావును రాజకీయం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. మృతుడు హరీశ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని హరీశ్ నుంచి రూ.7 లక్షలు ఇచ్చినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. కేవలం హరీష్ మాత్రమే కాదని హరీష్ లాంటి వారు దాదాపు 400 మంది ఉన్నారని..వారి దగ్గరి నుండి ఉద్యోగం పేరుతో లక్షల్లో తీసుకున్నారని స్థానికులు వాపోతున్నారు.

మరోపక్క RFCL బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌)లో ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు వసూలు చేసిన దళారులను అరెస్ట్‌‌‌‌ చేయాలని ఆయన అన్నారు. నిరుద్యోగుల నుంచి రూ.45 కోట్లు దండుకున్న ఈ కుంభకోణంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలన్నారు. శుక్రవారం రామగుండంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్​ను రీఓపెన్‌‌‌‌ చేయించడానికి నాన్న కాకా వెంకటస్వామి, నేను పార్లమెంట్‌‌‌‌లో చాలా సార్లు మాట్లాడాం. అప్పటి ప్రధాని మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌, ప్రణబ్‌‌‌‌ ముఖర్జీని కలిసి రూ.10 వేల కోట్ల అప్పును మాఫీ చేయించి కంపెనీని బీఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ జాబితా నుంచి బయటకు తీసుకువచ్చాం’’ అని గుర్తుచేశారు.