తాతగా మారిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి చిన్న కుమార్తె నైమిష పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తన ఇంట మనవడు జన్మించాడన్న విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చారు.

“నా చిన్న కూతురు నైమిష గతవారం మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు, తల్లికి మీ అందరి దీవెనలు కావాలి” అంటూ మనవడి ఫొటోను షేర్ చేసారు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించాడు. ఆయన 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్నాడు. ఆయన 2017 అక్టోబర్‌లో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌రెడ్డి 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ..కాంగ్రెస్ ను అధికారం లోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు.