లోక్​ సభలో రూపాయి పతనంపై నిర్మలా – రేవంత్ ల మధ్య మాటల యుద్ధం

లోక్​ సభలో రూపాయి పతనంపై వాడి వేడిగా చర్చ జరిగింది. ముఖ్యముగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. తాను మాట్లాడిన హిందీ భాషను ఉద్దేశించి నిర్మల చేసిన కామెంట్స్ పై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నేను శూద్రుడిని, నాకు స్వచ్ఛమైన హిందీ రాదు.. నిర్మలగారు బ్రాహ్మణవాది, మంచి హిందీ మాట్లాడుతారు”అని రేవంత్​ అన్నారు. కులం, మతానికి సంబంధించిన వ్యాఖ్యలు ఎవరూ సభలో చేయకూడదని స్పీకర్ ఓం బిర్లా తెలుపడం తో డాలరుతో రూపాయి మారకం విలువ పతనంపై కొశ్చన్ అవర్లో రేవంత్ మాట్లాడారు.

బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని మండిపడ్డారు. భారతీయ కరెన్సీ రోజురోజుకు బలహీనపడటంపై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాలర్ తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలన్నారు. గతంలో రూపాయి 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. రూపాయి ఐసీయూలో పడిపోయింది అన్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందని దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. రూపాయి పతనంతో సామాన్యులపై ఆ ప్రభావం పడుతోందని మండిపడ్డారు. ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందన్నారు. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు.