గాంధీ ఆసుపత్రికి రేవంత్..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసు కాల్పుల్లో గాయపడిన విద్యార్థులను పలకరించాడు రేవంత్. శనివారం సాయంత్రం గాంధీ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అంతకు ముందు పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించాలని హైదరాబాద్ నుండి రాకేష్ స్వగ్రామానికి బయలుదేరాడు. కానీ ఘాట్ కేసర్ దగ్గర పోలీసులు రేవంత్ ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, సాయంత్రం ఆయనను విడిచిపెట్టారు.
కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ స్కీంకు వ్యతిరేకంగా నిన్న శుక్రవారం ఆర్మీ విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అగ్ని గుండంగా మార్చిన సంగతి తెలిసిందే. కేంద్రం వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందలాది మంది యువకులు చొరబడి నిమిషాల వ్యవధిలోనే హింసాత్మకంగా మార్చారు. రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు బోగీలకు నిప్పు పెట్టారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా..ఓ యువకుడు మృతి చెందడం జరిగింది. కాగా ఈ దాడికి ముందే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వాట్సాప్ గ్రూప్‌లే వేదికగా ఈ విధ్వంసానికి ప్లాన్ చేసి అమలు చేశారని తేల్చారు. అరెస్ట్ అయిన పలువురి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్‌లోని ఆడియోలు, ఫొటోలు బయటపడడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనలో పాల్గొన్న వారు ఆర్మీ 17/6, చలో సికింద్రాబాద్, జస్టిస్ ఫర్ ఆర్మీ సీఈఈ, హాకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో కొన్ని గ్రూపులు ఏర్పాటు చేశారు. వీటిలో జరిపిన చాటింగ్, వాయిస్ మెసేజ్‌లు, సెల్ఫీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా అనుకున్నట్లుగా గురువారం రాత్రే సికింద్రాబాద్ చేరుకున్న కొందరు శిక్షణ కేంద్రం నిర్వాహకులు, అభ్యర్థులు స్టేషన్ ఎదురుగా సెల్ఫీలు దిగి.. వారి వారి వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. మిగతా అభ్యర్థులు భారీగా తరలిరావాలంటూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం స్టేషన్‌లో ఆందోళన ప్రారంభమైన కొంత సేపటి వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే.. ‘ఎంత సేపు అరిచినా ఏం లాభముండదు.. పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేసినమనుకో.. న్యూస్ బయటికి పోతది. ఎంతసేపు బ్యానర్లు చూపించినా.. ఎంత మొత్తుకున్నా ఏం అవ్వదు. గంట, రెండు గంటల్లో స్క్వాడ్ వస్తది. అందర్ని ఎల్లగొడతారు. అందుకే పెట్రోల్ బంకు పోయి పెట్రోల్ తీసుకొస్తే మొత్తం తగలబెట్టొచ్చు’ అని వాట్సాప్ గ్రూప్‌లో ఒకరు వాయిస్ మెసేజ్ పోస్ట్ చేసి, ఆందోళనకారుల్ని రెచ్చగొట్టారు. ‘నేను పెట్రోల్ తెచ్చేందుకు బంకుకు పోతున్నా. ఎవరైనా వస్తే రండి’ అని మరొకరు వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారికీ 14 రోజల రిమాండ్ విధించింది కోర్ట్.