కేసీఆర్ ఫై రేవంత్ రెడ్డి ఆగ్రహం..

గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆశ్రమాలలో , కాలేజీ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్‌ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పటల్ పాలవ్వగా..తాజాగా వరంగల్‌ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ లలో ఫుడ్‌పాయిజన్‌ అవుతున్నప్పటికీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా తెలంగాణ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ… ‘పేద బిడ్డల వసతి గృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. హాస్టళ్లలో చావు డప్పు మోగుతుంటే దేశానికే తెలంగాణ ఆదర్శమని కేసీఆర్ డప్పుకొట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారూ… మీకు మానవత్వం ఉందా? ఉంటే చలించడం లేదెందుకు?’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.