రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు – రేవంత్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలారని, తన రాజకీయ జీవితంలో రాజగోపాల్ రెడ్డి వంటి ద్రోహిని చూడలేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలోని కార్యకర్తల్లో భరోసా నింపడానికి శుక్రవారం చండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభ లో మరోసారి రాజగోపాల్ రెడ్డి ఫై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన నేత రాజగోపాల్‌రెడ్డి అని.. రాజగోపాల్‌రెడ్డి ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడని అంటూ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి చరిత్రహీనుడుగా మిగిలారని విమర్శించారు. నమ్మినవారిని మోసం చేసి కేంద్రమంత్రి అమిత్‌షా వైపు వెళ్లాడని, కాంగ్రెస్ పార్టీలో పోరాటాలకు కలిసి రాలేదు కానీ.. కాంట్రాక్టుల కోసం అమిత్‌షా వైపు వెళ్తాడా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కన్న తల్లిలాంటి సోనియాను మోడీ, అమిత్ షా ఈడీ పేరుతో వేధింపులకు పాల్పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారన్నారు. 75 ఏళ్ల వయస్సులో… కరోనాతో బాధపడుతున్న సోనియాను అమిత్ షా, మోడీ కక్ష్యగట్టి ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారన్న ఆయన… తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి అండగా ఉండాలని కోరారు.తల్లి సోనియాను అవమానిస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా ఊరుకుందామా అని ప్రశ్నించారు. సోనియా గాంధీని వేధిస్తోంటే పట్టించుకోకుండా రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధారణమన్న ఆయన… పార్టీ, సోనియా ప్రతిష్టను అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టిన రాజగోపాల్ రెడ్డిని… వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని… మరీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. జైలుకు పోయొచ్చిన రేవంత్ కింద పని చేయాలా అని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని… కానీ ఆ కేసులన్నీ 2014 తర్వాత టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకే పెట్టారని చెప్పారు. తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నారన్న రేవంత్… అమిత్ షా పక్కన నిల్చుంటే లేని బాధ తన పక్కన ఉంటే వచ్చిందా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు తిక్కలోల్లు కదా ఏదేదో మాట్లాడుతారు అని ఊరుకున్నామని… కానీ ఇవాళ సోనియాను మోసం చేసిన రాజగోపాల్ రెడ్డని ఓడించాలని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సే పదవులిచ్చినా రాజగోపాల్ రెడ్డిన పార్టీని మోసం చేశారన్నారు. పార్టీ ప్రతిష్టను అమిత్‌షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి.. రాజగోపాల్‌రెడ్డి 21 వేల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఉపఎన్నికలతో కాంగ్రెస్‌కు వెంట్రుక కూడా ఊడలేదని చెప్పారు. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినవారికి గుణపాఠం చెప్పాలని పిలపునిచ్చారు.

ఈ సభలో రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.