తాగుబోతులకు కేసీఆర్ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ రేవంత్ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై అలాగే కేటీఆర్ ఫై గజ్వేల్‌ సభ వేదికపై రేవంత్ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే… ఆయన కొడుకు కేటీఆర్‌… డ్రగ్స్‌ తీసుకునే వారికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారని అన్నారు.

గజ్వేల్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. లక్ష మంది అనుకుంటే దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల్లో నైరాశ్యం నెలకొందని పార్టీ​ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అని చెప్పారు. ఇందిరా గాంధీ మెదక్‌ నుంచే పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ వల్లే మెదక్‌కు అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ఎస్సీలు, గిరిజనులకు హక్కులు కల్పించిందే గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌ అని అన్నారు. ఎస్సీలు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిందే కాంగ్రెస్​ అని గుర్తు చేశారు.

ఇక రేవంత్ మాట్లాడుతూ..కేసీఆర్ ‌ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుందని గజ్వేల్‌ ప్రజలు ఆశించారని… ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, 3 ఎకరాల పొలం, నిరుద్యోగ భృతి వస్తాయని ఆశించారన్నారు. కానీ కేసీఆర్‌ పేదల భూములు లాక్కున్నారని.. 14 గ్రామాల ప్రజలను రోడ్డున పడేశారని రేవంత్ అన్నారు. తెలంగాణ ఇస్తే.. పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తానని సోనియాకు మాట ఇచ్చి వెన్నుపోటు పొడితారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబానికే మొత్తం పదవులు ఉన్నాయని.. కానీ 12 శాతం ఉన్న మాదిగలకు పదవులు లేవా ? అని ప్రశ్నించారు. తాగుబోతులకు కేసీఆర్‌..డ్రగ్స్‌కు కేటీఆర్‌ బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారని విరుచుకపడ్డారు.