రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఫై రేవంత్ రెడ్డి స్పందన

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి కండువా కప్పుకుంటారని వస్తున్న వార్తలపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌ రెడ్డి అంశం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. రాజగోపాల్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కానీ అధిష్టానం మాత్రం రాజగోపాల్ ఫై కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ కండువా కప్పుకోకముందే అతనిపై వేటువేసే అవకాశం కనిపిస్తోంది. షాకాజ్‌ నోటీసులు జారీ చేయాలా.. వేటు వేయాలా అనే దానిపై ఢిల్లీలో చర్చ జరుగుతోంది.

ఇక రాజగోపాల్ తాను బిజెపి లో చేరబోయేది ప్రకటించకపోయినప్పటికీ..బిజెపి నేతలు మాత్రం రాజగోపాల్ బీజేపీలోకి రావడం ఖాయమని చెపుతున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజగోపాల్ రాక ఫిక్స్ అయ్యిందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా ని కలిసింది వాస్తవమేనని.. తప్పకుండా బిజెపిలో చేరబోతున్నారని స్పష్టం చేశారు. నల్గొండ నుంచి చాలామంది బిజెపిలో చేరబోతున్నారని చెప్పుకొచ్చారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే పక్షంలో గతంలో హుజురాబాద్ మాదిరే మునుగోడుకు కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. బీజేపీలో చేరాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న తరుణంలో మునుగోడుకు ఉపఎన్నిక జరిగితే అది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే 2023లో అధికారం తమదేనని ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది.