ఈ కలెక్టర్ సుప్రీంకోర్టును మించిన సుప్రీమా?: రేవంత్

విత్తనాలు, ఎరువుల డీలర్లతో సిద్ధిపేట కలెక్టర్ భేటీ

హైదరాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఆ దుకాణదారులను జైలుకు పంపిస్తామని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కలెక్టర్ గా ఉన్నంతకాలం సుప్రీంకోర్టు చెప్పినా ఆ విత్తన దుకాణాలు తెరుచుకోవని కలెక్టర్ పేర్కొనడంపై రేవంత్ మండిపడ్డారు. ఈ కలెక్టర్ ఏమైనా సుప్రీంకోర్టు కంటే పెద్దవాడ్ని అనుకుంటున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామని సిద్ధిపేట కలెక్టర్ బెదిరిస్తున్నాడు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా షాపులు తెరిచేందుకు ఒప్పుకోబోమని అంటున్నాడు. అధికారులను కూడా సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఈ కలెక్టర్ సుప్రీంకోర్టును మించిన సుప్రీమా? తెలంగాణ సీఎం కార్యాలయం దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి” అంటూ రేవంత్ డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/