మోడీ మాయలో కేసీఆర్ – రేవంత్ రెడ్డి

మోడీ మాయలో కేసీఆర్ - రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..మోడీ మాయలో పడిపోయారని..రైతుల ఉద్యమానికి ముందుగా మద్దతునిచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా మారిపోయారని కనీసం మారుమాటైనా రైతుల గురించి మాట్లాడడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఈరోజు (సోమవారం) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్‌ 27) ఏడాదైన సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. రైతులు ప్రకటించిన బంద్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ లో ఉదయం నుండి కూడా బంద్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భాంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదని, మోదీని కలిశాకే కేసీఆర్ లో మార్పు వచ్చిందని, మోడీ ఏం మాయ చేశారోగానీ.. కేసీఆర్ పూర్తిగా మారారని రేవంత్ అన్నారు.

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని మండిపడ్డారు. ఇవాళ్టి బంద్ లో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా, మోదీతో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను బానిసలుగా మార్చిందని ఆరోపించారు.