మోడీ, కెసిఆర్ లపై రేవంత్ రెడ్డి విమర్శలు

మోడీ ఈ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారు
కేసీఆర్ ను గద్దె దింపితేనే సామాన్యులకు మేలు జరుగుతుంది

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ లపై మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి, ప్రజలకు స్వేచ్ఛా వాయువులను తీసుకొచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత్ ఒక శక్తిమంతమైన దేశంగా నిలబడిందని చెప్పారు. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.

మోడీ అమలు చేస్తున్నవన్నీ తెల్ల దొరల ఫాసిస్ట్ విధానాలే అని రేవంత్ విమర్శించారు. మోదీ విధానాలనే తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. మోడీ, కేసీఆర్ ల ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ఆశయాలు నెరవేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని… అయితే, కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు నెరవేరడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ను అధికారపీఠం నుంచి దింపితేనే సామాన్యులకు మేలు జరుగుతుందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/