రాజగోపాల్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలఫై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఈడీ దాడులు కొనసాగిన నేపథ్యంలోనూ తమదైన శైలిలో ఎవరికి వారు ప్రగతి భవన్ లో తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ట్వీట్ చేసారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భవన్- గాంధీ భవన్ భాయ్ భాయ్ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాటకాలకు, కల్వకుంట్ల కవిత డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించిందని పేర్కొన్నారు. ఢిల్లీలో తీగలాగితే ప్రగతి భవన్ మరియు గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది అని రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇక అంతే కాదు లిక్కర్ స్కామ్ ద్వారా కేసీఆర్ కుటుంబంతో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చీకటి బందం బట్టబయలైందని , కవిత కంపెనీలలో రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ కలిసి బిజినెస్ చేశారని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసాడు.

రాజగోపాల్ ట్వీట్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘చచ్చిన బర్రె పగిలిన కుండ నిండ పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉందంటూ విమర్శించారు. 2010 ఫిబ్రవరి 2న ఆ కంపెనీలో డైరెక్టర్‌గా చేరానని, 13 రోజుల్లో ఫిబ్రవరి 15న రిజైన్ చేశానట్టుగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆధారాలను రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో కంపెనీ క్లోజ్ అయిందని రేవంత్ తెలిపారు. ఇలాంటి చిల్లర కథలు ఏ విధంగాను మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవంటూ రేవంత్ పోస్ట్ చేశారు.