ఎమ్మెల్సీ కవిత వేసిన సెటైర్లకు..రేవంత్ సూటి ప్రశ్నలు

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ రెండు రోజుల పాటు పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం హన్మకొండ లో జరిగే రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేయబోయే… వ్యవసాయ విధానాన్ని రాహుల్‌ ప్రకటిస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు… పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా రాహుల్ పర్యటన నేపథ్యంలో తెరాస నేతలు సాత్రిలు , విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తెరాస ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ కు తనదైన స్టైల్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ట్విట్‌ కౌంటర్‌ ఇచ్చారు.

‘శ్రీమతి కవిత గారూ…. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుండి ఇక పై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్ లో 150 ఎకరాలలో వరిపంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?” అని ట్విట్టస్త్రాలు సంధించారు.

అక్కడితో ఆగకుండా “రైతుకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మరెక్కడ ఉన్నారు? రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తానని మీ తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు…మరి మీరెక్కడ ఉన్నారు? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాసులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు… వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు? ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా రూ.1400 లోపే అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?” అంటూ రేవంత్‌ రెడ్డి వరుస ప్రశ్నలు వేశారు.