బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు.. విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు

ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్ర‌భుత్వంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసిన ప్ర‌భుత్వం ఇచ్చింది మాత్రం ఏమీలేద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. గత బడ్జెట్లో పెట్టిన కొన్ని ప‌థ‌కాల‌కు ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుద‌ల చేయ‌లేద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. మ‌రికొన్నింటికేమో భారీగా కేటాయింపులు చేసినట్లు చూపించిన ప్ర‌భుత్వం అతి కొద్ది మొత్తంలో మాత్ర‌మే నిధులు ఇచ్చింద‌ని చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయ‌లేద‌ని, 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛ‌న్లు, అలాగే, గొర్రెల పంపిణీ, సమగ్ర భూసర్వే వంటి పలు ప‌థ‌కాల‌ను పెండింగ్ జాబితాలో పెట్టేసింద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

గ‌తంలోనూ నిరుద్యోగ భృతి కోసం రూ.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి, వాటిని ఇవ్వ‌కుండా జాప్యం చేయ‌డానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప‌థ‌కాల ప‌రిశీల‌న పేరిట అధికారుల‌కు ప‌నులు అప్ప‌జెప్పి చేతులు దులుపుకుందని చెప్పారు. 2021–22 బడ్జెట్లో నిరుద్యోగ భృతి మాటే లేకుండా చేసింద‌ని ఆ క‌థ‌నంలో తెలిపారు. వీటిని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావిస్తూ… ”బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు.. విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు. బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దే” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, ఈ నెలాఖ‌రున తెలంగాణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/