కేసీఆర్ అసోం సీఎం మీద కొట్లాడేది నిజ‌మేనా?: రేవంత్ రెడ్డి

అసోం సీఎంపై చ‌ర్య‌లు తీసుకోండి.. తక్షణమే స్పెషల్ టీం ఏర్పాటు చేయండి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మపై నేడు దేశ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదులు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై ఇటీవ‌ల హిమంత్ అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై కూడా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ అసోం సీఎం మీద, బీజేపీ మీద కొట్లాదేది నిజమే అయితే పోలీసుల మీద ఒత్తిడి చేయకూడ‌ద‌ని, త‌మ‌ ఫిర్యాదులపై పోలీసుల‌ను కేసులు నమోదు చేయనివ్వాల‌ని చెప్పారు. పోలీసులు 24 గంటల్లో కేసు నమోదు చేయాలని, అసోం సీఎంకి నోటీసులివ్వాలని, చ‌ర్య‌లు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణమే స్పెషల్ టీం ఏర్పాటు చేయాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసు నమోదు చేయకపోతే కమిషన్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు ముట్టడిస్తామ‌ని హెచ్చించారు. తాను హైదరాబాద్ కమిషనరేట్ ని ముట్టడిస్తాన‌ని, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధం కావాల‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ అధిష్ఠానం హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/