ఆర్‌బిఐ నిర్ణయాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు లింక్‌ ఉందా?

Reserve bank of india
Reserve bank of india

న్యూఢిల్లీ, : రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) గురువారం రెపోరేటును 25 బేసిస్‌పాయింట్లకు కుదించింది. ఎన్నికలకు ముందు రెపోరేటు తగ్గడం అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా శుభసూచకమేనా? గతంలో ఇలాంటి సందర్భాల్లో రెపో కట్‌ జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారంలోకి వచ్చాయా? ఇప్పుడు రేట్‌ కట్‌ బిజెపి పార్టీకి లాభిస్తుందా? అంటే చరిత్ర అవుననే అంటుందోని చెబుతున్నారు. ఉదాహరణకు గత మూడు లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే ఆర్‌బిఐ రేట్‌కట్‌ తర్వాత ఆయా ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వచ్చాయంటున్నారు. అదే సమయంలో రేట్‌ కట్‌ చేసిన సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు ఓడిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు ఏప్రిల్‌ 4 గురువారం రెపోరేటు తగ్గించడం 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి అడ్వాంటేజ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బిఐ రెపోరేటును పావుశాతం తగ్గించింది. ఇది కారు, వాహనాలు, పారిశ్రామిక రుణాలు తీసుకునే వారికి ఊరటనిచ్చింది. వారి ఇఎంఐ తగ్గుతుంది. రెపోరేటు తగ్గించడం మోడీ ప్రభుత్వానికి కలిసొస్తుందా? అసలు ఆర్‌బిఐ ప్రకటనకు, ఎన్నికలకు ఎక్కుడా నేరుగా సంబంధం లేదు. కానీ గత ఎన్నికలను పరిశీలిస్తే ఇది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, ఇది రాజకీయ మూఢనమ్మకంగా భావించినప్పటికీ గత ఫలితాలను చూపిస్తున్నారని అంటున్నారు. పలు కారణాల వల్ల ఆర్‌బిఐ ఈ ఏడాది జనవరి నుంచి రెండో సారి రెపో రేటును తగ్గించింది. ఒక విధంగా ఇది మోడీ ప్రభుత్వానికి ఊరట అంటున్నారు. రెపోరేటు తగ్గించడం ఇఎంఐతో రుణాలు తీసుకునే వారికి కూడా ఊరటనే. ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ ఏడాదికి ఆరుసార్లు ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తుంది. ఏప్రిల్‌, జూన్‌, ఆగస్టు, అక్టోబర్‌, డిసెంబరు, ఫిబ్రవరిలలో ఇది ఉంటుంది. అయితే ఏడాది మొత్తానికి ఏప్రిల్‌ నెల పాలసీని ప్రధానంగా భావిస్తారు. గతంలోని డేటా ప్రకారం ఆర్‌బిఐ మనీ పాలసీకి, లోక్‌సభ ఎన్నికలకు సంబంధం ఇలా ఉందని చెబుతున్నారు. 2014లో ఎన్నికలు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి మే 12వ తేదీ మధ్య జరిగాయి. మే 16వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. 2014 ఏప్రిల్‌ 1న ఆర్‌బిఐ పాలసీ సమీక్ష జరిగింది. ఆ సమయంలో రఘురాం రాజన్‌ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నారు. రెపోరేటును అప్పుడు యధాతథంగా ఉంచారు. నేటి రెపోరేటుతో పోలిస్తే అది చాలా ఎక్కువ. అప్పుడు 4 శాతంగా ఉన్న క్యాష్‌ రిసర్వ్‌ రేషియోను కూడా మార్చలేదు. అప్పుడు యూపిఏ ప్రభుత్వం పరాజయాన్ని చవిచూసింది. ఇదిలా ఉండగా, 2009లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 16-మే 13వ తేదీ మధ్య జరిగాయి. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానాన్ని ఏప్రిల్‌ 21న ప్రకటించింది. అప్పుడు డి సుబ్బారావు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో రెపోరేటున 25 బేసిస్‌ పాయింట్లుతగ్గించారు. 5 శాతంగా ఉన్న సిఆర్‌ఆర్‌ను మాత్రం మార్చలేదు. అలాగే, ఓవర్సిస్‌ రెపో రేటును 3.5శాతం నుంచి 3.25శాతానికి కుదించింది. అప్పుడు యూపిఎ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ గెలుపుకు రైతుల రుణమాఫీయే ఎక్కువ కారణమని భావించారు. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో రెపోరేటు తగ్గించలేదు. అప్పుడు ఏప్రిల్‌ 20 నుంచి మే 10వ తేదీ మధ్య ఆర్‌బిఐ తొలి రివ్యూ పాలసీని ప్రకటించింది. అప్పుడు వైవి రెడ్డి ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నారు. అప్పుడు రెపోరేటు మార్చలేదు. బ్యాంకు రేటు 6 శాతాన్ని, రెపోరేటు 4.5శాతాన్ని యధాతథంగా ఉంచారు. అప్పుడు వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయింది. 2004, 2014లో రెపోరేటు యధాతథంగా ఉంచారు. అప్పుడు ఆయా ప్రభుత్వాలు ఓడిపోయాయి. 2009లో రెపోరేటు తగ్గించారు. నాటి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆర్‌బిఐకి, ఎన్నికల ఫలితాలకు సంబంధం లేనప్పటికీ, దీంతో ఊరట చెందే వర్గాలు ఉంటాయి.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చెయండి : https://www.vaartha.com/news/business/