అంధుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌: ఆర్‌బీఐ

కరెన్సీ నోట్లు గుర్తించడం ఈజీ

RBI launches 'MANI' app
RBI launches ‘MANI’ app

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అంధుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రిలీజ్ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ యాప్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ‘MANI’  పేరుతో ఈ యాప్‌ను తయారు చేసింది ఆర్‌బీఐ. ‘MANI’  అంటే ‘మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్’. అంటే… మొబైల్ సాయంతో నోట్లను గుర్తించే యాప్ అని అర్థం. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు… ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. అంధులు నోట్ల విలువను అంటే అది ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కరెన్సీ నోట్‌ను మొబైల్‌లోని కెమెరా సాయంతో స్కాన్ చేస్తే చాలు… ఎన్ని రూపాయల నోట్ అన్న విషయం తెలుస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌లో ఆడియో ఔట్‌పుట్ ఉంటుంది.

2016 నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మహాత్మా గాంధీ సిరీస్’లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువైన నోట్లను రిలీజ్ చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించడంలో అంధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాప్ తయారు చేసింది ఆర్‌బీఐ. అయితే ఈ యాప్ ద్వారా ఆ నోటు ఒరిజినలో, డూప్లికేటో గుర్తించడం సాధ్యం కాదని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ రిలీజ్ చేసిన
‘MANI’  ‘ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/