కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్లను ఇది తగ్గిస్తుందన్న శాస్త్రవేత్తలు

ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే మెరుగంటున్న పరిశోధకులు

న్యూఢిల్లీ : మాత్రల రూపంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. దీని వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటీ ద్వారా తీసుకోవచ్చని పేర్కొన్నారు.

రక్తంలోను, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారుచేస్తుందన్నారు. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని వివరించారు. అంతేకాదు, ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే ఈ నోటి టీకా ‘ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ (ఐజీ-ఎ)ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల నుంచి వెలువడే వైరస్ కణాల సంఖ్యను తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/