పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ వేడుకల రద్దుఫై తెలంగాణ సర్కార్ ఫై బండి సంజయ్ ఫైర్

గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో తెలంగాణ సర్కార్ ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పరేడ్ గ్రౌండ్ లో ప్రతి ఏడాది జరిపే రిపబ్లిక్ వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ఇలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికె విరుద్ధమని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే ఇది. సీఎం తీరును బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

గవర్నర్ కు దక్కాల్సిన ప్రోటోకాల్ ను పాటించడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించడం లేదు. మహిళలంటేనే కేసీఆర్ కు చిన్నచూపు. అందుకే మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. రాజ్యాంగపరంగా ఉన్నత పదవిలో ఉన్న గవర్నర్ నే గౌరవించడం చేతగాని కేసీఆర్ మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేస్తారో, వారికి 35 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలు ఆలోచించాలి అన్నారు. స్వతంత్ర్య భారతదేశంలో గణతంత్ర వేడుకలు ఎక్కడైనా స్వేచ్ఛగా నిర్వహించే హక్కుంది. నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. కరోనా సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేమని చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారు. కేసీఆర్ ను జోకర్ లా చూస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించే బహిరంగ సభలకు అడ్డురాని కరోనా నిబంధనలు గణతంత్ర వేడుకలకు వర్తింపజేయడం సిగ్గు చేటు అని బండి సంజయ్ అన్నారు.

మరోపక్క తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాదిలాగే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్లో కాకుండా రాజ్ భవన్ లో నిర్వహించాలంటూ ప్రభుత్వం లేఖ పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేరుతో రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి కూడా గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆమె సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ రిపబ్లిక్ డే వేడుకల్లో తమిళిసై పాల్గొంటారు.