రేణు దేశాయ్‌కు కరోనా అంటూ తప్పుడు ప్రచారం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదిక అసత్య వార్తలపై మండిపడింది. తనకు కరోనా సోకిందనే వార్తను ఓ వెబ్‌సైట్ ప్రచురించగా, అది కాస్త వైరల్ అయ్యింది. దీంతో ఆ వార్త రేణూ దేశాయ్ కంట్లో పడింది. ఇక సదరు వెబ్‌సైట్‌పై రేణూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తూ వారు ప్రజలకు ఏం చెప్పాలని చూస్తున్నారని రేణు దేశాయ్ మండిపడింది.

ఇలా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త మాత్రమే కాదు, ఇంకా చాలా వెబ్‌సైట్లలో తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి అనేక తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదని ఆమె ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచురించే వెబ్‌సైట్స్‌ను ప్రజలు ఫాలో కావద్దంటూ ఆమె చెప్పుకొచ్చింది. సెలెబ్రిటీలకు సంబంధించి ఏదైనా వార్త రాస్తే, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుంటే మంచిదని ఆమె తెలిపింది.

ఇక రేణు దేశాయ్‌కు కరోనా అని రాసిన సదరు వెబ్‌సైట్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ద్వారా డబ్బులు సంపాదించడం ఏమిటని వారు మండిపడుతున్నారు. జర్నలిజం అనే మాటకు తూట్లు పొడుస్తూ ఇలాంటి ఫేక్ న్యూస్ వెబ్‌సైట్లలో పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వాటిని ఏమాత్రం ఆదరించకపోవడమే మంచిదని పలువురు అంటున్నారు.