రిలయన్స్ ఏజీఎం సమావేశం.. కీలక ప్రకటన చేసిన ముకేశ్ అంబానీ

ప్రపంచంలో ‘అత్యంత చౌకైన ‘జియో ఫోన్ నెక్స్ట్’ లాంచ్ చేసిన జియో

సెప్టెంబరు 10న వినాయక చవితిని పురస్కరించుకుని మార్కెట్లో విడుదల

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం నేడు ప్రారంభమైంది. ఈసందర్బంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా సౌదీ అరాం కో చైర్మన్, పీఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యాన్ చేరబోతున్నట్టు ప్రకటించారు. బోర్డులో ఆయన చేరిక రియలన్స్ అంతర్జాతీయీకరణకు ప్రారంభమని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలోనూ అరాంకో, రిలయన్స్ మధ్య బలమైన బంధం ఏర్పడిందని అన్నారు. ఈ ఏడాది తమ భాగస్వామ్యం మరింత వేగవంతమువుతందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

టెలికం వ్యాపారం గురించి మాట్లాడుతూ.. రిలయన్స్ జియో ఈ ఏడాది 37.9 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుందని, ఇప్పుడు జియో ఖాతాదారుల సంఖ్య 425 మిలియన్లకు చేరుకున్నట్టు చెప్పారు. మొత్తం 22లో 19 సర్కిళ్లలో మార్కెట్ల లీడర్‌షిప్ తమదేనని వివరించారు. ఆర్ఐఎల్ 44.4 బిలియన్ డాలర్లను సమీకరించిందని, ప్రపంచంలో మరే కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో మూల ధనాన్ని సేకరించలేదని పేర్కొన్నారు. ఈ మూలధన పెంపు భారతదేశ వృద్ధి సామర్థ్యంలో ప్రపంచ పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉందని అన్నారు. గత ఏడాది కాలంగా భారత్‌లో జియో ఫైబర్ 2 మిలియన్లకు పైగా కొత్త ప్రాంగణాలను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. జియోఫైబర్‌కు 3 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు చెప్పారు. జియో ఫైబర్ దేశంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్‌గా రికార్డులకెక్కిందన్నారు.

ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలో ‘అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్’ జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా బయటికి ప్రకటించలేదు. చాలా మంది మార్కెట్ నిపుణులు ఈ మొబైల్ రూ.5,000 లోపు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జియో ఇన్ స్టిట్యూట్ వివరాలు తెలిపారు. నవీ ముంబయిలో జియో ఇన్ స్టిట్యూట్ స్థాపిస్తున్నట్టు వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ఈ విద్యాసంవత్సరం నుంచే జియో ఇన్ స్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జీవితకాల శిక్షణ, అత్యున్నత ఆవిష్కరణలకు జియో ఇన్ స్టిట్యూట్ ఓ ప్రపంచస్థాయి వేదికగా నిలుస్తుందని నీతా అంబానీ అభివర్ణించారు. దీనిద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 వేల మంది పిల్లలకు క్రీడల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు, బాలికల సాధికారతకు కృషి చేస్తామని వివరించారు. ముఖ్యంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, కొవిడ్ తో పోరాటానికి తమ రిలయన్స్ ఫౌండేషన్ 5 కార్యాచరణలు ప్రారంభించిందని నీతా అంబానీ వెల్లడించారు. మిషన్ ఆక్సిజన్, మిషన్ కొవిడ్ ఇన్ ఫ్రా, మిషన్ అన్న సేవ, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష పేరిట ఈ ఐదు మిషన్లు కొనసాగుతాయని వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/