రెడ్ క్రాస్ సంస్థ తొలి మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఎగ్గ‌ర్‌

జెనీవా : ప్రపంచ ప్రసిద్ధ మానవతావాద సంస్థ ‘ అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ ‘ పగ్గాలు తొలిసారిగా ఓ మహిళ చేతికి రానున్నాయి. రెడ్‌ క్రాస్‌ తర్వాతి అధ్యక్షురాలిగా స్విట్జర్లాండ్‌ దౌత్యవేత్త మిర్జానా స్పొల్జారిక్‌ ఎగ్గర్‌ను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఎగ్గర్‌ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్నారు. రెడ్‌ క్రాస్‌ ప్రస్తుత అధ్యక్షుడు పీటర్‌ మారర్‌ పదవీకాలం వచ్చే సెప్టెంబర్‌తో ముగుస్తుంది.

ఆయన స్థానాన్ని ఎగ్గర్‌ భర్తీ చేయనున్నారు. తన నియామకం గురించి ఎగ్గర్‌… ‘రెడ్‌ క్రాస్‌ అధ్యక్షురాలిగా ఎంపికవడం చాలా గొప్ప గౌరవం. గొప్ప బాధ్యత. ఈ మలుపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను’ అని ఉత్సాహంగా చెబుతున్నారు. అణగారిన ప్రజల అవసరాలను వెలుగులోకి తెచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ వాతావరణంలో పనిచేస్తున్న రెడ్‌ క్రాస్‌ బృందాల కృషికి సార్థకత చేకూరుస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎగ్గర్‌ ఐక్యరాజ్య సమితిలో, స్విట్జర్లాండ్‌ విదేశాంగ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/