వాయుగుండం..చెన్నై, 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్

నేడు, రేపు 12 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

చెన్నై: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 6న కురిసిన రికార్డు స్థాయి వర్షంలో చెన్న నీట మునిగింది. ఆ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీటి తొలగింపు కార్యక్రమాలు పూర్తికాకముందే మరోసారి నగరాన్ని భారీ వర్షాలు పలకరించాయి. పలు జిల్లాల్లోనూ వరుణుడు బెంబెలేత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలోనూ, 12 జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు.

వాతావరణ శాఖ చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, తేన్ కాశీ, కన్యాకుమారి, మధురై, శివగంగై, పుదుకోట్టై, తిరునల్వేలి, తిరువారూరు, రామనాథపురం జిల్లాలకు అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై నగరంలో కుండపోత వర్షానికి 8 సబ్ వేలు మునిగిపోయాయి. నగరంలో సహాయక చర్యల నిమిత్తం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి, వైగై, తేన్ పెన్నై, భవానీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/