యూరప్‌లో కరోనా బీభ‌త్సం..ఒక్క రోజులో లక్షలాది కేసులు

ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలో ప్రతి రోజూ లక్షలాది కేసులు

ఫ్రాన్స్‌: యూరప్‌లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ప్రతి రోజూ లక్షలాది కేసులతో వణుకుతోంది. నిన్న 24 గంటల వ్యవధిలో ఫ్రాన్స్‌లో 2.70 లక్షలు, బ్రిటన్‌లో 2 లక్షల మందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. ఇక, అమెరికాలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఆ దేశంలో ఏకంగా 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవే ఉండడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలంతా తప్పకుండా కరోనా టీకాలు వేయించుకోవాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా విజృంభణ మొదలు కావడంతో భారత్, పాకిస్థాన్, అమెరికా, బ్రిటన్‌తోపాటు మరో నాలుగు దేశాల నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ ఈ నెల 21 వరకు నిషేధం విధించింది. హాంకాంగ్ తీరానికి చేరుకున్న నౌకలో 9 మంది ఒమిక్రాన్ బాధితులు ఉండడంతో వారిని నౌకలోనే ఉంచేశారు. అందులోని వేలాది మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒమిక్రాన్ రోగులు 9 మందికీ నెగటివ్ రిపోర్టులు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, వ్యాక్సిన్ తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు. వారి జీవితాలకు పరిమితులు విధిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని ఇబ్బంది పెట్టాలని ఉందన్న ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/