ఏపి కొత్త సీఎస్‌గా బాధ్యతల స్వీకరణ

L V Subrahmanyam
L V Subrahmanyam

విజయవాడ: ఏపిలో సీఎస్‌ పునేఠా వ్యవహారశైలిపై వైఎస్‌ఆర్‌సిపి ఫిర్యాదుతో ఈసీ ఆయన్ను తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానంలో ఈరోజు ఏపి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉగాది నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సుబ్రహ్మణ్యం.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ సీఎస్ కు దుర్గమ్మ చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సుబ్రహ్మణ్యం సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అన్నిరకాలుగా సంతోషంగా ఉండేలా పనిచేస్తానని సీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉగాది రోజున అమ్మవారిని దర్శించుకుని ఏపీ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/