నా నిర్ణయానికి కారణం భారత్‌

Mohammad Qureshi
Mohammad Qureshi

ఇస్లామాబాద్‌: అబుదాబీలో జరిగే ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌(ఓఐసీ) సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషి శుక్రవారం వెల్లడించారు. ఆ సమావేశానికి భారత్ హాజరుకానుండటమే ఆయన నిర్ణయానికి కారణం. విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి నేను హాజరుకావట్లేదుఅని షా పార్లమెంటులో వెల్లడించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆయనకు బదులుగా పాకిస్థాన్ తరఫున ఇతర అధికారులు హాజరుకానున్నట్లు పేర్కొంది. అబుదాబీలో ఈ రోజు జరిగే సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ మొదటిసారి పాల్గొంటున్నారు. ఈ భేటీలో ఉగ్రవాద అంశాన్ని సుష్మ లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే గౌరవ అతిథి హోదాలో ఆమె ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అరబ్, ముస్లిం ఆధిక్య దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునే ప్రయత్నాల్లో భారత్‌కు దక్కిన ఆహ్వానాన్ని అధికారులు దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు.