వైకాపా మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా?

తిరుప‌తి అసెంబ్లీ ప‌రిధిలో రీ పోలింగ్: చంద్రబాబు డిమాండ్

Chandra babu
Chandra babu

Amaravati: తిరుప‌తి అసెంబ్లీ ప‌రిధిలో ప్ర‌స్తుతం జ‌రిగిన పోలింగ్ ను ర‌ద్దు చేసి, రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు. వైకాపా దొంగ ఓట్లు వేయించింద‌ని ఆరోపించారు . శనివారం మధ్యాహ్నం అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, రీపోలింగ్ కోరుతూ లేఖ‌ను అంద‌జేశామ‌ని వెల్లడించారు. మేము అంద‌జేసిన ఆధారాలను పరిశీలించి , కేంద్ర బ‌ల‌గాల‌తో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. తిరుప‌తిలో దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని త‌మ పార్టీ అభ్య‌ర్ధి ప‌న‌బాక ల‌క్ష్మీ పోలింగ్ కేంద్రాల‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో పోలీసుల దృష్టికి తెచ్చార‌ని, కొంత మంది దొంగ ఓట‌ర్ల‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశార‌ని వివ‌రించారు..
బిజెపి అభ్య‌ర్ధి ర‌త్న‌ప్ర‌భ‌, ఆ పార్టీ సీనియ‌ర్ నేత శాంతారెడ్డి వైకాపా దొంగ ఓట్ల భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టార‌ని, అలాగే దొంగ ఓట‌ర్ల‌ను పోలీసులకు ప‌ట్టివ్వ‌డ‌మే కాకుండా, ప‌లు ప్రైవేటు వాహ‌నాల‌ను సీజ్ చేయించార‌ని గుర్తుచేశారు.అన్ని పార్టీలు దొంగ ఓట్ల‌పై గ‌గ్గోలు పెడుతుంటే, వైకాపా మాత్రం వాటిని ఆరోప‌ణ‌ల‌ను అంటూ తీసిపారేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.. ఉపఎన్నికకు వందల బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిహద్దులు మూసివేసి తనిఖీలు చేసి పంపాలని , కానీ ఎందుకు చెక్‌పోస్టులను ఎత్తివేశారు? అని నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో వేల మందిని ఉంచితే.. పోలీసులు నిద్రపోతున్నారా? అని చంద్రబాబు దుయ్యబట్టారు. అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వైకాపా మాఫియా చేతిలో ప్రజాస్వామ్యం బలైపోవాలా? అని చంద్రబాబు నిలదీశారు. ఎక్కడి నుంచో ముఠాలను దించి తిరుపతిపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/