బకాయిల చెల్లింపుతో..ఆర్‌కామ్‌ షేర్లు పైపైకి..

reliance communications
reliance communications


ముంబై: ఎరిక్సన్‌ కంపెనీకి బకాయిల చెల్లింపుతో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) షేర్లు లాభాల బాట పట్టియి. మంగళవారం నాటి ట్రేడింగ్‌ళో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో బిఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 10 శాతం లాభంతో రూ. 4.4 వద్ద ట్రేడవుతుంది. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, హోమ్‌ ఫైనాన్స్‌, నావెల్‌, నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా 4-5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఎరిక్సన్‌కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ. 550 కోట్లు చెల్లించేందుకు ఈ నెల 19 వరకు సుప్రీంకోర్టు అనిల్‌ అంబానీకి గడువు ఇచ్చిన సంగతి విదితమే. నిధులున్నప్పటికీ, తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో, ఉద్దేశ్యపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్‌ను గత ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది కూడా. బకాయిలు చెల్లించకపోతే అనిల్‌ను జైలుకు పంపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐగే గడువుకు ఒక్క రోజు ముందు అనిల్‌ ఈ మొత్తాన్ని ఎరిక్సన్‌కు చెల్లించారు. అనిల్‌ జైలుకు వెళ్లకుండా ఆయన అన్న ముకేశ్‌ అంబానీ ఈ ఆర్థిక సాయం చేశారు. విపత్కర పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అన్నావదినలు ముకేశ్‌, నీతాలకు అనిల్‌ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.