మరో దఫా రేటు కోత?

RBI
RBI

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్‌ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో.  జనవరి నుంచీ వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం (0.25+0.25+0.25+0.35) తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 4 శాతం దిగువన నిర్దేశిత లక్ష్యాల లోపు కొనసాగుతుండడం రెపో రేటు కోతకు కలిసి వస్తున్న అంశం.