బలహీనమైన ఆసీస్‌ను ఓడించామని ఎవ్వరూ అనరు

Ravi Shastri
Ravi Shastri

బెంగళూరు: బలహీనమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించామని ఇక ఎవ్వరూ అనరు అని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అంటున్నాడు. ఆసీస్ గడ్డపై చివరిసారిగా జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో (2018-19) ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. ఆ సమయంలో ఆసీస్ జట్టులో ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేరు. బాల్ ట్యాంపరింగ్ నిషేధం కారణంగా ఇద్దరు జట్టుకు దూరమయ్యారు. ఆపై భారత్ తమ తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకుంది. వార్నర్, స్మిత్ లేనందువల్లే భారత్ సిరీస్‌లు గెలుచుకుందని విమర్శకులు అన్నారు. ప్రస్తుతం వార్నర్, స్మిత్, లబుషెన్, కమిన్స్, స్టార్క్ ఉన్నా కూడా భారత్‌ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంతో రవిశాస్త్రి పైవిధంగా స్పందించారు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘టీమిండియా ఆటగాళ్లు గొప్పగా ఆడారు. ప్రతిఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ముంబైలో ఓడినా.. పటిష్ట ఆస్ట్రేలియాపై మిగతా రెండు మ్యాచ్‌లలో అద్భుత విజయాలు సాధించాం. టీమిండియాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. బలహీనమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించామని ఇక ఎవ్వరూ అనరు’ అని పేర్కొన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/