తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు

రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగియనున్న సేవలు

ratha-saptami-celebrations-at-tirumala

తిరుమలః తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు అధికారులు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. అలాగే, అన్న ప్రసాదాలు, పాలు, నీరు పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి వారు వెండి రథంపై ఊరేగనున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి.

కాగా, తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు కల్ప వృక్ష వాహనం, సాయంత్రం ఆరు నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. చివరగా చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/