మజ్నుతో బాలీవుడ్ ఎంట్రీ.. మీకు అర్థమవుతోందా?

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన, ఆ సినిమా సక్సెస్ కావడంతో తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుండటంతో చాలా త్వరగా ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన రష్మకి, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది.

అయితే ఇటీవల నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్న రష్మిక మందనపై ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు పడింది. దీంతో ఆమెకు అప్పుడే బాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయి. తాజాగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిషన్ మజ్నులో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేశారు చిత్ర యూనిట్. పూర్తి రా ఏజెంట్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో రష్మిక పాత్ర అద్భుతంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక తాను బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఇంకా నమ్మలేకపోతున్నానంటూ రష్మిక తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

పాకిస్థాన్‌లో భారతీయ ఏజెంట్ జరిపిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా మిషన్ మజ్ను కథ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పుష్ప చిత్రంలో రష్మిక మందన ఓ డీగ్లామర్ రోల్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.