నకిలీ నోట్ల కేసులో వైస్సార్సీపీ మహిళా నేత అరెస్ట్

ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా పని చేస్తున్న రసపుత్ర రజిని నకిలీ నోట్ల చలామణి కేసులో అరెస్ట్ అయ్యింది. రజని ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమెకు రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా పదవి కూడా ఉంది. ఇటీవల ఆమె పదవీకాలం ముగియగా.. మరోసారి పదవిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు 2017లో ప్రొద్దుటూరులో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో ఈమెను నకిలీ నోట్ల కేసులో బెంగుళూర్ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చ గా మారింది. ఈమె తో పాటు చరణ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె దగ్గర నుండి రూ.44 లక్షల విలువగల రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో తమకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఈ నోట్లను తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో చలామణిలోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రజిని పోలీసులకు దొరికిపోవడంతో ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది. నకిలీ నోట్ల చలామణిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో అప్పులు చేసి ఐపీ పెట్టిన రజనికి.. కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇప్పించారని ఆరోపించారు. ఈ ఫేక్ కరెన్సీ వెనుక ఎవరున్నారో తేలాలని.. సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి అన్నారు.