తిరుపతి వింత ఘటన..భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ బయటకు వచ్చింది

తిరుపతి నగరంలో వింత ఘటన చోటు చేసుకుంది. 18 అడుగుల లోతున భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ ..ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున దానిని చూసేందుకు వస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్‌లో ఓ ఇంట్లో 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్.. భూమిలో ఉండేది. 18 సిమెంట్ రింగులతో భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించారు. గురువారం ఆ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఇంటి యజమాని అందులోకి దిగి శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ట్యాంక్ పైకి లేచింది. ట్యాంక్ పైకి లేస్తుండటంతో.. అందులో ఉన్న మహిళ తీవ్ర భయాందోళనకు గురై.. ట్యాంక్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక భూమి లో నుండి పైకి వచ్చిన ట్యాంక్.. ఇప్పటికీ నిటారుగా నిలిచి ఉంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే, దీనిపై అధికారులు స్పందించారు. ఇది సహజ పరిణామమే అని చెబుతున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా భూమి లోపలి పొరలు బాగా నానడం వల్ల.. వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని చెబుతున్నారు.