తన గొప్ప మనసు చాటుకున్న రావు రమేష్..

ప్రముఖ సీనియర్ నటుడు రావు రమేష్ తన గొప్ప మనసు చాటుకున్నారు. తన పర్సనల్ మేకప్ మేన్ మృతి చెందగా.. ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. అలనాటి లెజండరీ నటుడు రావు గోపాలరావు తనయడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్.. తనదైన నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. సీమ సింహం మూవీతో చిత్రసీమలో అడుగుపెట్టిన రమేష్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విలన్‌గా, తండ్రిగా.. అన్ని విధాలుగా ఆయన ఆడియన్స్‌ను మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించారు.

రావు రమేష్ కు పర్సనల్ మేకప్ మేన్ బాబు రీసెంట్ గా మరణించారు. దీంతో వారి కుటుంబానికి తనవంతు సాయం అందజేశారు రమేష్. స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆయన రూ.10 లక్షల చెక్ ను వారికీ అందజేశారు. బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ విషయం బయటకు రావడంతో రావు రమేష్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది మానవతా దృక్పథానికి నిలువెత్తు నిదర్శనమని అంటున్నారు.