శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్సే స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. పార్లమెంటులో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓటింగ్‌లో రణిల్‌కు 134 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి దలస్ అలాపేరుమాకు 82 ఓట్లు లభించాయి.
మొత్తం 223 ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఇద్దరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. పోలైన 223 ఓట్లలో 219 ఓట్లు చెల్లుబాటు అవుతాయని పరిగణనలోకి తీసుకున్నారు. నాలుగు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత రణిల్ విక్రమసింఘే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కించటానికి అన్ని పార్టీలూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. అలాగే, గురువారం నాడు తాను స్వయంగా అన్ని పార్టీలతో సమావేశమై చర్చిస్తానన్నారు.

విక్రమసింఘే ఆరుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పని చేశారు. సంక్షోభంలో చిక్కుకున్న దేశం నుంచి పారిపోయిన వారం కిందట అధ్యక్ష పదవికి రాజీనామా గొటబాయ స్థానంలో ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యహరించారు. ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించి నూతన అధ్యక్షుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోనున్నారు.