విచారణ పేరుతో రామోజీరావును వేధిస్తున్నారు – జనసేన నేత నాగబాబు

రామోజీరావు … ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఈనాడు గ్రూప్ కి చైర్మెన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అలాంటి వ్యక్తి ఇటీవల మార్గదర్శి చిట్ ఫండ్ కేసుతో వార్తల్లో నిలుస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో భాగంగా ఏపీ CID అధికారులు రామోజీరావు ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ తరుణంలో జనసేన నేత నాగబాబు ..రామోజీరావు ను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ పేర్కొన్నారు. రామోజీరావును, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం సరికాదన్నారు. రామోజీరావుపై సోషల్ మీడియా లో కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధిని తీసుకొచ్చి వేలాదిమందికి ఆయన జీవనాధారం కల్పించారని ప్రశంసించారు. కళారంగంలో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీరావు తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పారని అన్నారు. పద్మవిభూషణ్ రామోజీరావు లక్షల మందికి ఆదర్శప్రాయులని కొనియాడారు. సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు నాగబాబు ట్వీట్ చేశారు.

మరోపక్క ఈ కేసులో ఇప్పటికే పలువురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసిన సీఐడీ..రీసెంట్ గా రామోజీరావును హైదరాబాద్ లో విచారించింది. ఇందులో మార్గదర్శి అక్రమాలకు సంబంధించి సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని రామోజీరావుకు సీఐడీ గత వారమే నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు కూడా ఇదే విధంగా నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన వీరు సీఐడీ విచారణకు అందుబాటులో ఉండే తేదీల్ని వెల్లడించారు. దీంతో హైదరాబాద్ లో తన కుమారుడు కిరణ్ నివాసంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామోజీరావును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును సీఐడీ అధికారులు మార్గదర్శి కేసులో ఐదు గంటల పాటు 46 ప్రశ్నలు సంధించారు. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలోని 23 సభ్యుల బృందం జూబ్లీహిల్స్ లోని ఇంటికి వెళ్లి ఆయన్ను విచారించింది. ఉదయం 11.30కు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం అలసటగా ఉందని రామోజీరావు చెప్పడంతో మధ్యలో ఆగింది. తిరిగి డాక్టర్లు ఆయన్ను పరీక్షించిన తర్వాత 2.30 గంటలకు మళ్లీ మొదలైంది. సాయంత్రం ఐదున్నర వరకూ ఈ విచారణ సాగింది. సీఐడీ విచారణలో రామోజీరావు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామోజీరావు వాంగ్మూలం నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు అవసరమైతే మళ్లీ విచారిస్తామని తెలుపడం జరిగింది.