తెలంగాణ లో రాష్ట్రపతి శీతాకాల పర్యటన ఖరారు..

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈనెల 29న భాగ్యనగరానికి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్న కోవింద్.. జనవరి మూడో తేదీ వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనపై కొద్దిరోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే రాష్ట్రపతి పర్యటనను ఖరారు చేస్తూ రాష్ట్ర అధికారులకు అధికారిక సమాచారం రావడంతో తగిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ పర్యటనకు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. షెడ్యూలుకు అనుగుణంగా రాష్ట్రపతి బొల్లారం నుంచే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల పర్యటనలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది.