ముచ్చింతల్‌లో ప్రారంభమైన ఆధ్యాత్మిక సందడి

హైదరాబాద్: రామానుజాచార్యుల‌ సహస్రాబ్ది వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌ క్షేత్రంలో రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. యాగశాల వద్ద శోభాయాత్ర, వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు జ‌రుపుతున్నారు. ఆ క్షేత్ర ప్రాంతం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల‌ 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ క్రతువు జ‌రుగుతోంది. లక్ష్మీనారాయణ మహా యజ్ఞం, 108 దివ్యదేశాల ప్రతిష్ఠ, కుంభాభిషేకం, సమతామూర్తి లోకార్పణ కార్య‌క్ర‌మాల‌తో పాటు నాలుగు వేదాలకు చెందిన 7 శాఖల పారాయణం, పది కోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపం, ప‌లు పురాణ, ఇతిహాస, ఆగమ గ్రంథాల పారాయణం చేస్తారు.

యాగశాలల వద్ద 1,035 కుండాలకు అవసరమైన యాగసామగ్రిని మహిళలు సిద్ధం చేశారు. హోమాల్లో ఐదు వేల మంది రుత్వికులు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలకు ఈనెల 5వ తేదీన‌ ప్రధాని మోదీ, 13వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్న విష‌యం తెలిసిందే. దీంతో క్షేత్ర ప్రాంగణంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/