రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినంద‌నీయం : రాకేశ్

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఇలా ఢిల్లీలో పోరాడ‌డం కేంద్ర స‌ర్కారుకే సిగ్గుచేటు.. రాకేశ్ టికాయ‌త్‌

న్యూఢిల్లీ: రైతు ఉద్య‌మ నేత రాకేశ్ టికాయ‌త్ తెలంగాణ ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద‌ టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు. దేశంలో ఏం జ‌రుగుతోందని ప్ర‌శ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉన్నార‌ని చెప్పారు. ధాన్యం కొనాలని నేడు తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోందని, ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఇలా ఢిల్లీలో పోరాడ‌డం కేంద్ర స‌ర్కారుకే సిగ్గుచేటని అన్నారు.

ధాన్యం కొనుగోలుకు దేశంలో ఒకే విధానం ఉండాలని, లేదంటే రైతులు రోడ్ల‌పైకి రావాల్సి వ‌స్తుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న‌ది రాజ‌కీయ ఉద్య‌మం కాదని ఆయ‌న అన్నారు. రైతుల కోసం ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆందోళ‌న చేస్తున్నారని ఆయ‌న చెప్పారు. రైతుల ప‌క్షాన తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నానని అన్నారు. దేశంలో రైతుల కోసం పోరాటం ఎవ‌రు చేసినా తాను మ‌ద్ద‌తు తెలుపుతాన‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినంద‌నీయ‌మ‌ని రాకేశ్ టికాయ‌త్ ప్ర‌శంసలు కురిపించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/