రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభలో సాగు చట్టాల దుమారం

న్యూఢిల్లీ: పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ చట్టాల దుమారం రేగుతోంది. రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. చర్చ జరగాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభ మూడుసార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైనా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీల సభ్యులు తమ పట్టు వీడలేదు.

సభా కార్యక్రమాలు నిలిపివేసి తక్షణమే వ్యవసాయ చట్టాలపై చర్చ చేపట్టాలని వారు స్పష్టం చేశారు. రూల్ 267 ప్రకారం చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరగా, చైర్మన్ వెంకయ్యనాయుడు వారి డిమాండును తిరస్కరించారు. ఆ రూల్ కింద చర్చ చేపట్టలేమని అన్నారు. ఈ అంశంపై తొలుత లోక్ సభలో చర్చ జరగాల్సి ఉందని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. రేపటి నుంచి రైతుల సమస్యలు చర్చిద్దామని చెప్పినా, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దాంతో, రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అంతకుముందు సభ ఆరంభంలోనే విపక్ష సభ్యులు వాకౌట్ చేయడంతో వాడీవేడి వాతావరణం నెలకొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/