పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపు.. రాజ్యసభలో విపక్షాల ఆందోళన
ధరలు తగ్గించాలని ప్లకార్డులు
వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించిన వైనం

న్యూఢిల్లీ : కొన్ని నెలల పాటు పెరగని పెట్రోలు, డీజిల్ ధరలు నేడు ఒక్కసారిగా లీటరుకు 90 పైసలు, 87 పైసలు పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతాయని అందరూ ఊహించినట్లుగానే మళ్లీ పెరుగుదల మొదలు కావడంతో దీనిపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించిన విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ వెంకయ్యనాయుడు సభను తొలుత 12 గంటలకు వాయిదా వేశారు.
ఆ తర్వాత రెండవసారి కూడా వెల్‌లోకి దూసుకువచ్చిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో డిప్యూటీ చైర్మెన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. పెట్రోల్‌పై ఇవాళ 90 పైసలు, గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. దాదాపు 137 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్‌పై ధరలను పెంచారు. చివరిసారి 2021, నవంబర్ 2వ తేదీన పెట్రోల్ ధరలు పెంచారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/