మిత్ర ధర్మానికి టిడిపి తూట్లు

RAJANDH SINGH
RAJANDH SINGH

మిత్ర ధర్మానికి టిడిపి తూట్లు

గుంటూరు అర్బన్‌ : కేంద్రంలో గత ప్రభుత్వాలు నడిపిన కాంగ్రెస్‌ యుపిఎ కూటమి గత చరిత్ర తెలిసి కూడా సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌లో ఉచ్చులో పడితే చిత్తగాక తప్పదని కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌అన్నారు.మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయం భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన శిలాఫలకాన్ని ఆవిష్క రించారు. అనంతరం నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో జరిగినభారీబహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరించిందని గతంలో పొగిడిన సీఎం చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వాన్ని వీడి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ మిత్ర ధర్మానికి తూట్లు పొడిచారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పూర్తిస్థాయి సహాయసహకారాలు అందిస్తున్న ప్పటికీ టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నూరు శాతం నిధులు అందిస్తామని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు నిర్మాణం తామే చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కాంట్రాక్టుకు అంగీకరించా మన్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తిపడి సబ్‌కాంట్రాక్టులిచ్చి ప్రాజెక్టు అంచనా వ్కయాన్ని పెంచుకుంటూ నిర్మాణం జాప్యం చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 1500 కోట్లు, గుంటూరు- విజయవాడ నగరాల అభివృద్ధికి ఇప్పటికే వెయ్యి కోట్లు అందించామన్నారు. విభజన చట్టంలో లేని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రాష్ట్రానికి కేటాయించి ఆదుకున్నామన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజే ముద్దు అన్న చంద్రబాబు ప్యాకేజీ పొందిన తర్వాత ప్రత్యేక హోదా పేరుతో అధర్మ దీక్షలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.3,900 కోట్లను రెవెన్యూ లోటుబడ్జెట్‌ కింద అందించామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ సస్వపరిపాలన అందిస్తున్నా రన్నారు.

దేశవ్యాప్తంగా 32 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించి మహిళాభివృద్ధికి పెద్దపీట వేశామ న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించిన భాజపా గత ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. అదేతరహాలో కేంద్రంలో భాజపా ప్రభుత్వం గద్దెనెక్కనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్ర యపడి కాంగ్రెస్‌పార్టీకి దేశ ప్రయోజనాలు పట్టవని దుయ్యబట్టారు. అచేతనావస్థలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ మునిగిపోయే నావ లాంటిదని అలాంటి పార్టీని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావచ్చన్న చంద్రబాబు పగటి కలలు కంటు న్నారన్నారు.

వంశపారంపర్య రాజకీయాలకు వేదికైన కాంగ్రెస్‌ పార్టీలో నెహ్రూ, గాంధీ కుటుంబాల వారికే ప్రాధాన్యత ఉంటుందని మాజీ ప్రధానులైన లాల్‌బహుదూర్‌, పీవీ నరసింహారావులకు ఆపార్టీ ఏవిధంగా గౌరవిం చిందో అందరికీ తెల్సునన్నారు. దేశంలో ఇంటా బయటా టెర్రరిజం నక్సలిజంను కూకటివేతో అణచివేస్తున్నామన్నారు.రానున్నఎన్నికల్లో ప్రజలుతిరిగి తమనుఆదరిస్తారని ఆకాంక్షించారు. సభకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, జీవీఎల్‌ నరసింహారావు, మురళీధరన్‌, ఎమ్మె ల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారా యణ, పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌దేవధర్‌, జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్త్రి, మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఎస్సీమోర్చా జాతీయ అధ్య క్షుడు వినోద్‌సోన్‌కర్‌, తదితరులు పాల్గొన్నారు.