రాజీవ్ గాంధీ హత్య కేసు : జైలు నుండి విడుదలైన నళిని

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన హంతకురాలైన నళిని శ్రీహరన్ 31 ఏళ్ల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త మురుగన్ సహా సంతాన్ కూడా వెళ్లూరు జైలు నుంచి సాయంత్రం విడుదలయ్యారు. సంబంధిత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన తర్వాత జైలు అధికారులు నళినిని బయటకు వదిలారు. ఈ కేసులో దోషులుగా ఉన్నవారిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్ పయస్‌, రవిచంద్రన్, శ్రీహరన్‌‌, జయకుమార్‌, శంతనును విడుదల చేయాలని సూచించింది. తమ శిక్షను సడలించాలని, విడుదల చేయాలని నళిని, రవిచంద్రన్‌లు దాఖలు చేసిన పిల్‌‌పై కోర్టు విచారించింది. అనంతరం ఈ ఆదేశాలు ఇచ్చింది.

మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్‌ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టు, అనంతరం అది యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. కుమార్తెను చూసుకోవాలన్న అభ్యర్థన మేరకు మొదట నళిని మరణశిక్షణు యావజ్జీ కారాగార శిక్షగా ధర్మాసనం మార్చింది. సెప్టెంబర్ 9, 2018న జరిగిన కేబినెట్ సమావేశంలో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిని గవర్నర్‭కు సిఫారసు చేసింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ తీవ్ర ఆలస్యం చేశారు.

ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని నళిని, రవిచంద్రన్ సైతం సుప్రీం తలుపు తట్టారు. కాగా, ఈ దోషుల్లో ఒకరైన పెరివాలన్ 30 ఏళ్ల జైలు జీవితం అనంతరం ఈ మధ్యే విడుదలయ్యారు. తాజా సుప్రీం తీర్పుతో మిగిలిన వారు కూడా బయటకు వచ్చారు.