స్వదేశీ సూర్యుడు రాజీవ్‌ దీక్షిత్‌!

యువతను జాగృతం చేసిన బాటసారి

Rajiv Dixit
Rajiv Dixit – File

భారతదేశ స్వాతంత్య్రం కోసం ఆరున్నర లక్షల మంది ప్రాణత్యాగం చేశారని, వారందరూ స్వదేశీ స్వావలంబన కోరుకున్నారని, కాని అవి దక్క లేదని ఆవేదనతో సామాజిక ఉద్యమకారుడు రాజీవ్‌ దీక్షిత్‌ .

కాలుకు బలంకట్టుకుని దేశమం తటా పర్యటించారు. మహాత్మా గాంధీ, భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితర వీరుల త్యాగాలను, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని స్వదేశీ ఆందోళనతో ఎందరినో ఆయన ఆకర్షించాడు.

ముఖ్యంగా యువతను పెద్దఎత్తున కది లించాడు. అనర్గళ ఉపన్యాసాలతో మంత్రముగ్దుల్ని చేసే ఆయన బహిర్గతపరిచిన సమాచారం ఎందరినో ఆలోచింపచేసింది.

ప్రముఖ గాంధేయవాది, విద్యా ధికుడు, వినమ్రశీలి ప్రొఫెసర్‌ ధరమ్‌పాల్‌ శిష్యుడిగా సాధికార సమాచారం ఆధారంగా గంటల తరబడి సంవాదం చేయడం ఆయన ప్రత్యేకత. సామాజిక కార్యకర్త, మంచివక్త, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లిన స్వదేశీ ఉద్యమకారుడాయన.

ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు, అరవింద్‌ఘోష్‌ విప్లవ నినాదం, భగత్‌సింగ్‌ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, ఉరికొయ్యలను ముద్దాడిన అనేక మంది వీరుల ఉచ్ఛ్వాసనిశ్వా సాల సాక్షిగా ఆయన స్వదేశీ స్వతంత్ర భావ జాలాన్ని దేశ మంతటా మరోసారి విత్తారు.

మహాత్మాగాంధీ కోరుకున్న స్వదేశీ విధానం,రామరాజ్యం ఇంకా రాలేదన్నది ఆయన ఆవేదన.

దేని కోసమైతే పండిత్‌రాంప్రసాద్‌ బిస్‌మిల్‌, సచింద్రనాథ్‌ లాహిరి, చంద్రశేఖర్‌ ఆజాద్‌ అమరులయ్యారో వీరి కలలు సాకారం కాలేదని ఆ వెలితి స్పష్టంగా కనిపిస్తోందని,వారి కలను నిజం చేసేందుకు యువత నడుం బిగించాలని, నిద్ర నుంచి మేల్కొవాలని నిరంతరం నిప్పుకణికలా మండుతూ తిరిగిన బాటసారి ఆయన.

స్వాతంత్య్రం వచ్చాక దేశంపై ప్రేమతో, త్యాగధనులు వేసిన బాటలో పయనించిన విద్యాధికుడు.విస్తృత అధ్యయన శీలి,శీలవంతుడు రాజీవ్‌దీక్షిత్‌ ఒక్కరే అంటే అతిశయోక్తి అవదు.

బ్రిటిష్‌ పాలకులు పోయినా వారి ‘వారసత్వం వారు ఏర్పరిచిన ‘వ్యవస్థలు పోలేదని, ఆ ‘వాసన అలాగే కొనసాగుతోందని ఆయన ప్రధాన వాదన.

ఆంగ్లేయులతోపాటు వారి సంస్కృతి, సభ్యత పోవాలి. స్వదేశీ సంస్కృతి సంప్రదాయం రావాలి. ఈ ప్రధాన నినాదాన్ని మరవడం వల్ల దేశ ప్రజలకు ఎంతో నష్టం జరుగుతోందని, అన్యాయం పాలవ్ఞతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు.

రాజకీయనాయకుల్లో అధికారదాహం, పదవీ వ్యామోహం కారణంగా భగత్‌సింగ్‌, ఉద్దమ్‌సింగ్‌ తదితరుల కలలు నెరవేరడం లేదని ఈ పరిస్థితిని మార్చేందుకు మరోస్వదేశీ ఆందోళన అవసరమేనని ఆయన సిద్ధాంతం.

స్విట్జర్లాండ్‌ మరికొన్ని విదేశాల్లో కొందరు దాచుకున్న నల్లధనం బ్రిటిష్‌వాళ్లు దోచుకున్న దానికన్నా ఎక్కువగా ఉందని, ఈ ధనాన్నిదేశంలోకి తీసుకువచ్చేందుకు ఒత్తిడి తీసుకురావాలన్నది ఆయన డిమాండ్‌.

ఈ అభిప్రాయంతో ఏకీభవించిన రామ్‌దేవ్‌ బాబాతో కలిసి ‘భారత్‌ స్వాభిమాన్‌ పేర చైతన్యయాత్రలు చేశారు.అనేక సభలు, సమావేశాలు నిర్వహించి వాస్తవాల్ని ప్రజల ముందుపెట్టారు.కళ్లు చెదిరే సంపద ఎంతెంత ఎక్కడెక్కడ మూల్గుతున్నదో వివరిస్తుంటే వీక్షకుల గుండెల్లో మంటలు పుట్టాయి.

20 లక్షల కోట్ల ధనం విదేశాల్లో మూలుగుతోందని, ఆ ధనం దేశంలోకివస్తే దేశంనుంచి పేదరికాన్ని తరిమివేయవచ్చని, అనేక మౌలిక సదుపాయా లను గ్రామ సీమల్లో ఏర్పరచ వచ్చని ఆయన లెక్కలు తీసిచెప్పారు.

1947లో అధికార మార్పిడి జరి గిందితప్ప ప్రజలకు స్వాతంత్య్రం రాలేదని, ‘తెల్లదొరలు పోయిన నల్లదొరలు గద్దె నెక్కారని కొందరు ఒకప్పుడు సైకిల్‌ సైతం లేకున్నా పదవి చేపట్టాక, కోట్ల ధనం కూడేసి స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో జమచేసుకున్నారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

ఆ దోపిడీ విధానాన్ని కళ్లకుకట్టాడు. తెల్లదొరలు దేశసంపదను లండన్‌కు తరలిస్తే, నల్లదొరలు స్విస్‌ బ్యాంకులకు తరలిస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోయేవారు.

వంద సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌,లాలాలజపతిరాయ్, అరబిందోఘోష్‌, గధర్‌ వీరులు ఇలాంటి దేశాన్ని ఆశించలేదని, సంపూర్ణ స్వదేశీ బానిసత్వం నుంచి పూర్తి విముక్తిని ఆశించారు తప్ప అవే చట్టాలతో, అదే పరిపాలనా విధానంతో అదే న్యాయవ్యవస్థతో, అదే పోలీసు చట్టాలతోపాలన సాగించాలని కాదని ఆయన ఆ వీరుల ఉపన్యాసాలను ఉటంకించారు.

భారత స్వాతంత్య్ర పోరాట ప్రధాన లక్ష్యం స్వదేశీయత. గ్రామాల పునర్జీవనం, కుటీర పరిశ్రమల వికాసం. దీన్ని విస్మరించి పూర్తి ‘బానిసత్వ ఆలోచనలతో నాయకులు అధికారులు కాలం గడుపుతున్నారని ఆయన అధిక్షేపణ, ఆరోపణ.

గ్లోబలైజేషన్‌ పేర బహుళజాతి సంస్థలు పెద్దఎత్తున భారతదేశంలోకి ప్రవేశించిఈస్టిండియా కంపెనీల మాదిరి దోచుకుంటున్నారని భారతీయ పరిశ్రమల పరిరక్షణ జరగాలనిరాజీవ్‌ దీక్షిత్‌ 1990 ప్రాంతంలో ఆజాదీ బచావో ఆందోళన్‌ అన్న సంస్థనుస్థాపించి యువతలో ఆలోచనలు రేకెత్తించారు.

బ్రిటిషు వారి వలస పాలనలో 50 దేశాలుండగా ఆ బానిసత్వం నుంచి విముక్తి కోసం ఏ దేశంలోనూ ప్రాణత్యాగాలు చేయనంతగా భారతదేశంలో వీరులు బలిదానాలిచ్చారని జలియన్‌ వాలాబాగ్‌ లాంటి సంఘటనల్లో లక్షల మంది ప్రజలు ప్రాణాలిచ్చారని అంతమూల్యం చెల్లించింది

స్వదేశీయత కోసం తప్ప అవే పాత విధానాలతో పాలన సాగించాలని కాదని గుర్తు చేశారు. లండన్‌లో ఎందరో స్వతంత్య్ర సమరయోధులు ఉరికంబాలు ఎక్కివిప్లవ నినాదాలు చేసింది స్వాతంత్య్రం స్వదేశీయత, సాధికారత కోసమని గుర్తుచేశారు.

కోట్ల మంది హింసాకాండను ఎదుర్కొని మరెందరో జైళ్లపాలై, వికలాంగులై సర్వస్వం కోల్పో యింది దేశ బంగారు భవిష్యత్‌ కోసమే తప్ప నిరుద్యోగం, పేదరికం, ఆకలిచావులు పెరిగేందుకు కాదని ఆయనయువతను ఆలోచింపచేశారు.

మన్మోహన్‌సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ అర్జున్‌సేన్‌ సింగ్‌ అధ్యక్షన పేదరికంపై అధ్యయనానికి ఒక కమిటీ వేయగా ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో దేశంలో జరగవలసినంత అభివృద్ధి జరగలేదని, వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.

ఇలాంటి ఎన్ని అధ్యయనాలు జరిగినా, నివేది కలు వచ్చినా అవన్నీ బుట్టదాఖలు కావడమేకాని కార్యాచరణ కొరవడిందని, ముందుచూపు లేదని రాజీవ్‌దీక్షిత్‌ పదేపదే గుర్తు చేశారు.

తలసరి ఆదాయం పెరగలేదని, నిరుద్యోగం పెరిగిం దని దీనికంతటికి కారణం బ్రిటిషుకాలం నాటి వ్యవస్థలేనని, పూర్వ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ ఈ లోపభూయిష్టమైన వ్యవస్థ గూర్చి గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేసేవారు.

ఢిల్లీ నుంచి పేదల కోసం ఒక రూపాయం విడుదల చేస్తే పేదవాడికి పదిహేను పైసలు మాత్రమే అందుతున్నాయన్న నగ్నసత్యం అందరు గుర్తెరగాలని ఆయనపదేపదే చెప్పారు.

ఇలాంటి వ్యవస్థ ఉన్నంతకాలం గరీబీ హఠావో సాధ్యంకాదని ఇంకా పేదరికం పెరుగుతుందే కాని తరగడం లేదని ఆయన అధికారిక లెక్కలను పది మంది ముందు పట్టేవారు.

సంపూర్ణ అంకిత భావంతో దేశసేవకే జీవితాన్ని అర్పించిన అరుదైన వ్యక్తిత్వం గల రాజీవ్‌దీక్షిత్‌ 30 నవంబర్‌ 1967లో అలహాబాద్‌లో జన్మించారు.

కాన్పూర్‌ ఐఐటి నుంచి ఎంటెక్‌ పట్టాపొందారు. విదేశాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులు, స్వదేశంలోని పరిస్థితుల్ని బేరీజువేసుకుని స్వదేశీ ఆందోళన చేపట్టారు.

తొలి రోజుల్లో భోపాల్‌ గ్యాస్‌లీక్‌ సంఘటన ఆయనను కలిచివేసింది. విదేశీ సంస్థలను పారదోలి స్వదేశీయతను ప్రోత్సహించాలన్న తన సంకల్పానికి మరింత బలం చేకూరింది.

2010 సంవత్సరం నవంబరు 30 (పుట్టినరోజునే) అనారోగ్యంతో కన్నుమూశారు.

దశాబ్దం క్రితం వరకు దేశమంతా స్వదేశీ ఆందోళనకు మారుపేరైన రాజీవ్‌దీక్షిత్‌ కార్యాచరణ మహా రాష్ట్రలోని మహాత్మాగాంధీ సేవాగ్రామ్‌ సమీపాన ఇంకా కొనసాగుతోంది. ఆ దివిటీ వెలుగుతూనే ఉంది.

  • ఉప్పల నరసింహం, సీనియర్‌ జర్నలిస్టు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/