చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించిన రజనీకాంత్

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదిక ఫై మాట్లాడుతూ చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు గారు నాకు 30 ఏళ్ల నుంచి మిత్రులు. నా ఫ్రెండ్ మోహన్ బాబు ఆయన్ని పరిచయం చేయించారు. పరిచయం చేసేటపుడే చెప్పారు. ఒరేయ్.. పెద్ద నాయకుడవుతారని. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు గారితో మాట్లాడేవాన్ని. ఆయనతో మాట్లాడితే నా జ్ఞానం పెరిగింది. ఇరవై నాలుగు గంటలు జనాలకు మంచి చేయాలన్నదే ఆయన ఆలోచన. ఇండియన్ పాలిటిక్స్ కాదు వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయనొక దీర్ఘదర్శి. ఇది నేను చెప్పేది కాదు. ఆయన ఘనత ఏంటో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరికీ తెలుసు’ అని అన్నారు.

‘విజన్ 2020 గురించి ఆయన 1996, 1997 టైమ్‌లోనే చెప్పారు. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చారు. లక్షల మంది తెలుగు ప్రజలు ఐటీలో పనిచేస్తూ లగ్జరీగా బతుకుతున్నారంటే చంద్రబాబు కారణం. ‘జైలర్’ షూటింగ్ సందర్భంగా ఈ మధ్యే హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లాను. నేను ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అర్థం కాలేదు. హైదరాబాద్ ఎకనామికల్‌గా కూడా అభివృద్ధి సాధించిందని విన్నాను. మాన్యశ్రీ చంద్రశేఖర్ రావు గారు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఇక చంద్రబాబు గారు పదవిలో ఉన్నా, లేకున్నా.. అపాయింట్‌మెంట్ అడిగిన వెంటనే ఇస్తారు. నా బర్త్‌డే రోజు ఖచ్చితంగా ఫోన్ చేసి విషెస్ తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేందుకు దేవుడు ఆయనకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.