పోల‌వ‌రంతో ల‌క్ష ఎక‌రాలు మునిగిపోతాయి – ర‌జ‌త్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య అన్ని సమస్యలు ముగిసిపోయాయి అనుకుంటుంటే..ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తుంది. తాజాగా వచ్చిన భారీ వరదలతో భద్రాచలం ముంపు గ్రామాలతో పాటు పట్టణం లోని పలు కాలనీ లు నీట మునిగాయి. దీనికి కారణం పోలవరం ఎత్తు అని ఖమ్మం టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని ఏపీ మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగానే పోలవ‌రం ప్రాజెక్టుతో ల‌క్ష ఎక‌రాల భూమితో పాటు భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాల సైతం మునిగిపోతాయ‌ని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చ గా మారాయి.

రాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ర‌జ‌త్ కుమార్ బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌త్ కుమార్ మాట్లాడుతూ.. పోల‌వ‌రంతో ల‌క్ష ఎక‌రాల వ‌ర‌కు మునిగిపోతాయి. బ్యాక్ వాట‌ర్‌తో పంట న‌ష్టంతో పాటు చారిత్రాత్మ‌క ప్రాంతాల‌కు ముప్పు ఉంది. భ‌ద్రాచ‌లం, ప‌ర్ణశాల కూడా మునిగిపోతాయ‌ని అన్నారు. పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ విష‌యంలో స్ట‌డీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు లేఖ‌లు రాశామ‌ని , బ్యాక్ వాట‌ర్ న‌ష్టం, ఇత‌ర‌త్రా అంశాల‌పై కేంద్రం ఇప్ప‌టికీ స్పందించ‌లేద‌ని పేర్కొన్నారు. మరి ర‌జ‌త్ కుమార్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.